సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

  • 2024 డైరీ ఆవిష్కరణలో బొప్పరాజు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ మొదటి వార్షికోత్సవ సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సంక్షేమ సంస్థ 2024 డైరీని ఆవిష్కరించారు. అనంతరం బొప్పరాజు, సంక్షేమ సంస్థ అధ్యక్షులు ఆర్లయ్య మాట్లాడుతూ.. మొదట విడత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం అనంతరం కోల్పోయిన సర్వీస్‌ 9 నెలలు, రెండో విడత నియామకమైన అనంతరం కోల్పోయిన 5 నెలలకు సంబంధించిన ఆర్థిక, సర్వీస్‌ పరమైన అంశాలపైన ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎనర్జీ అసిస్టెంట్లు నియామకం గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ద్వారా జరిగిందని, కానీ వారి విధులు డిస్కమ్‌ల ద్వారా అందిస్తూ గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో దాదాపు 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 200 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారని అన్నారు. సచివాలయ పరిధిలో విధులకు హాజరయ్యే విధంగా, జీత భత్యాలు కూడా సచివాలయ డిడిఒ 010 పద్దు ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి జాక్‌ అమరావతి పక్షాన కోశాధికారి మురళీకృష్ణమనాయుడు, ఉమెన్స్‌ వింగ్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ప్రధాన కార్యదర్శి సీపాన గోవిందరావు, వైస్‌ ప్రెసిడెంటు జ్యోతి, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️