ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు తిరుచ్చికి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 17,00,000/- విలువ కలిగిన 440 గ్రాముల దొంగిలించబడిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటివలే నవంబర్ మొదటి వారంలో చిత్తూర్ పట్టణం లో సిందు టవర్స్ హోటల్ ఎదురుగా పార్క్ చేసిన కారు నుండి బంగారు నగలను దొంగలించిన సంఘటనపై చిత్తూర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సదరు దొంగతనం కేసును చిత్తూర్ జిల్లా ఎస్.పి వై.రిశాంత్ రెడ్డి, ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో, చిత్తూర్ డి. ఎస్. పి. కే. శ్రీనివాసమూర్తి అధ్వర్యంలో, చిత్తూర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. విశ్వనాధ్ రెడ్డి, సబ్-ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ ఎస్. మల్లికార్జున మరియు బి. భారతి మరియు ఇతర సిబ్బందితో మూడు బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు ప్రాంతాలలో ముమ్మర దర్యాప్తు చేశారు. తమిళనాడు రాష్ట్రం, తిరుచిరాపల్లిలో బ్రతుకు తెరువు కోసం వచ్చి స్థిరపడిన వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, ఖరగ్పూర్ కు చెందిన ఒక అంతరాష్ట్ర దొంగల ముఠా చిత్తూర్ పట్టణంలో సిందు టవర్స్ హోటల్ ఎదురుగ పార్క్ చేసిన కారు యొక్క అద్దం పగులకొట్టి అందులో నుంచి కీర్తన ఫైనాన్సు కంపెనీకి చెందిన 38 ప్యాకెట్ల బంగారు నగలను దొంగిలించుకొని వెళ్లినట్టు గుర్తించి, సదరు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులలో నుంచి ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగముగా సదరు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుల వద్ద నుంచి రూ. 17, 00, 000/- విలువ కలిగిన 440 గ్రాముల దొంగాలించబడిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన దుండగుల కొరకు ముమ్మర చర్యలు కొనసాగిస్తూన్నారు. దర్యాప్తులో సదరు దొంగల అంతరాష్ట్ర దొంగల ముఠా బంగారు షాపుల వద్ద, బ్యాంకుల వద్ద, రద్దీ ప్రాంతాలలో, గోల్డ్ ఫైనాన్సు కంపెనీల వద్ద, బస్సు స్టాండ్ ల వద్ద, రైల్వే స్టేషన్, ATM కేంద్రాల వద్ద, హోటల్స్, అపార్ట్మెంట్లు, లాడ్జి ల వద్ద కాపు కాస్తూ ఉమ్మడి కార్యాచరణ ద్వారా వ్యక్తుల యొక్క దృష్టి మరల్చి బ్యాగులు, విలువైన వస్తువులు దొంగతనం చేయడం, కార్ల యొక్క అద్దాలు పగులకొట్టి చేస్తునట్టు తెలిపారు.