ఎయులో ఆరుబయలు రంగస్థలం ప్రారంభం

Nov 25,2023 09:04 #andhra university, #nagarjuna

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): ఆంధ్రా యూనివర్సిటీలో ఆధునికీకరించిన ఆరుబయలు రంగస్థలాన్ని సినీ నటుడు అక్కినేని నాగార్జున శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర సృష్టించిన కళా ప్రాంగణాన్ని ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఈ వేదిక నుంచి భవిష్యత్తులో ఎందరో కళాకారులు పుడతారన్నారు.. తనపై ప్రేమాభిమానాలు పంచుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎయు హిందీ విభాగం గౌరవ ఆచార్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ మహోన్నత సంస్కారం కలిగిన వ్యక్తిగా నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నిలుస్తారన్నారు. ఆయన అప్పట్లో గుడివాడ కళాశాలకు రూ.లక్ష విరాళం ఇవ్వడం, ఎయుకు రూ.25 వేలు అందివ్వడం ఎంతో గొప్ప విషయమని కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు తెలిపారు. ఎయు విసి ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సిఎం సూచన మేరకు విద్యార్థులకు ఓపెన్‌ ఎలక్టివ్స్‌ మ్యూజిక్‌, గానం, నృత్యం, చిత్రలేఖనం, నటన కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. రెండున్నర దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఆరుబయలు రంగ స్థలాన్ని దాతల సహకారంతో, ప్రభుత్వం అందజేసిన నాడు-నేడు నిధులతో పూర్తిస్థాయిలో ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కార్యక్రమంలో హీరో అక్కినేని అఖిల్‌, నాగార్జున సోదరి సుశీల, ఎయు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌, రెక్టార్‌ ఆచార్య కె.సమత తదితరులు పాల్గన్నారు. అనంతరం ఎయు-సెయింట్‌ లూక్స్‌ ఆడియో ఇంజనీరింగ్‌ కోర్సుల పోస్టర్‌ను నాగార్జున ఆవిష్కరించారు.

➡️