ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు )పల్నాడు జిల్లాలో దారుణం చేటుచేసుకుంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కోనంకి గ్రామంలో నివాసం ఉంటున్న అనంత నరేష్ (30) మొదటి భార్యతో విబేధాల కారణంగా.. ఎనిమిదేళ్ల క్రితం ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన మాధురిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలు తరుచూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మరోసారి గొడవపడ్డారు. జరిగిన విషయాన్ని తన సోదరుడు దోమ శ్రీనివాసరావు, తండ్రి సుబ్బారావులకు మాధురి ఫోన్‌చేసి తెలిపారు. సాయంకాలం వారు కోనంకి గ్రామానికి చేరుకున్నారు. చర్చలు జరుగుతుండగా ఒక్కసారిగా నరేష్, అతని తండ్రి సాంబయ్య (56), తల్లి ఆదిలక్ష్మి (50)పై కత్తులతో శ్రీనివాసరావు, సుబ్బారావు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. అనంతరం మాధురి, ఆమె సోదరుడు, తండ్రి ముగ్గురూ కలిసి ముప్పాళ్లకు వెళ్లిపోయి పోలీస్‌స్టేషన్‌లో లంగిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.