ప్రజాశక్తి-తిరుపతి టౌన్: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ కేంద్రాన్ని స్వచ్ భారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూప మిశ్రా కమిషనర్ హరిత ఐఏఎస్, అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రై వేస్ట్ రికవరి ప్లాంట్ ను, తడి చెత్త నుండి ఎరువులు తయారు చేసే ప్లాంట్ ను అదేవిధంగా బయో మిథన్ గ్యాస్ ప్లాంట్ పనిచేసే విధానాన్ని కమిషనర్ క్షుణ్ణంగా వివరించారు. నగరంలో ప్రతి ఇంటి నుండి, హోటల్స్, దుకాణాల, హాస్పిటల్స్ నుండి మూడు రకాలుగా చెత్త సేకరణ చేస్తున్నామని తెలిపారు. ఆ చెత్తను ఆటోల ద్వారా నగరంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ పర్ స్టేషన్ కు
తరలిస్తామని తెలిపారు. అక్కడ నుండి పెద్ద టాంకర్ల సిఏపిఎస్.యుఎల్ఈఎస్ ద్వారా తూకివాకం తరలించి నిర్వహణ చేస్తామని వివరించారు. బయో మిథనైజేషన్ ప్లాంట్ నుండి సి.ఎన్.జి గ్యాస్ ఉత్పత్తి చేసే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న చెత్త నిర్వహణ చాలా బాగుందన్నారు. చెత్త సేకరణ విధానం కూడా బాగుందని, మరింత మెరుగ్గా చేస్తే చెత్త నిర్వహణలో దేశంలోనే తిరుపతి నగరపాలక సంస్థ ఆదర్శనీయంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిఈ విజయకుమార్ రెడ్డి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.