ప్రజాశక్తి-హిందూపురం: అద్దె చెల్లించనందుకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఆర్టిసి కాలనీ నాల్గవ వార్డు సచివాలయ భవనానికి ఆ ఇంటి యజమాని తాళం వేశారు. నాలుగు నెలలుగా బకాయి ఉన్న అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాళం వేసి, సచివాలయం ముందు నిరసన తెలిపారు. యజమాని నాగరాజు మాట్లాడుతూ.. సచివాలయానికి సంబంధించి అద్దె చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఏ ఒక్కరూ స్పందించలేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో సచివాలయానికి తాళం వేశానన్నారు. అద్దె మొత్తం చెల్లించి, సచివాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి తాళం వేశారన్న విషయం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో పురపాలక సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ యజమానిని పిలిపించి నాలుగు నెలల అద్దె రూ. 24వేలకు సంబంధించిన చెక్కును అందించారు. అదే విధంగా ఈ సచివాలయంతో పాటు మిగిలిన సచివాలయాలకు ఇవ్వాల్సిన అద్దె బకాయిలను చెల్లించారు.