- అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా అందని వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆహారం సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరా అస్తవ్యస్తంగా మారినా అడిగే నాథుడే లేకుండాపోయాడు. దీంతో చిన్నారులకు ఆహారం పెట్టేందుకు అంగన్‌వాడీలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పూర్వ ప్రాథమిక విద్య అందించడంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్ల పిల్లలను చేర్చుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో పది ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో 2,289 వరకూ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్ల వయస్సు గల పిల్లలు 30 వేల మందికిపైగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు ప్రాజెక్టుల పరిధిలో 1,662 కేంద్రాలు ఉండగా 20 వేల మందికిపైగా చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులు ఉదయం తొమ్మిది గంటలకు కేంద్రానికి వచ్చి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉంటారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణలో భాగంగా ఆహారం అందిస్తున్నారు.నెలలో 25 రోజులకు సరిపడా ఆహారం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉండగా 15 నుంచి 20 రోజుల్లోపు వరకే సరఫరా చేస్తున్నారు. దీంతో మిగిలిన రోజుల్లో చిన్నారులకు ఆహారం పెట్టేందుకు అంగన్‌వాడీ ఉద్యోగులు నానావస్థలు పడుతున్నారు. పక్క కేంద్రాల్లో ఉంటే తెచ్చుకోవడం, లేకపోతే ఇంట్లో సరుకులు తీసుకెళ్లి వంటచేసి పెట్టడం చేయాల్సి వస్తోంది. చాలా నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఏఒక్క అధికారీ పట్టించుకోవడం లేదు. గట్టిగా మాట్లాడితే గర్భిణులకు ఇచ్చే ఆహారం తగ్గించి చిన్నారులకు సర్దుబాటు చేయాలన్నట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. తాము ఇండెంట్ సక్రమంగానే పెడుతున్నామని అధికారులు చెప్పడం మినహా చర్యలు మాత్రం లేవు. అరకొరగా సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు మాత్రం లేకుండాపోయాయి. సంపూర్ణ పోషణ ఆహారం నెలలో సగం రోజులు కూడా అందించకపోతే చిన్నారులకు ఏవిధంగా పోషకాహారం అందుతుందో ప్రభుత్వం, అధికారులు చెప్పాలి. అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి ఆహారం సరఫరా నుంచి భవనాలకు అద్దె చెల్లించే వరకూ అంతటా తీవ్ర నిర్లక్ష్యం తాండవిస్తున్న పరిస్థితి ఉంది.అద్దె బకాయిలు ఇవ్వరు.. బెనిఫిట్స్ అందించరురెండు జిల్లాల్లోనూ అత్యధిక అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గ్రామాలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన అద్దె చెల్లించాల్సి ఉంది. అద్దె రూ.రెండు వేల నుంచి రూ.ఐదు వేల వరకూ ఉంది. చాలాకాలంగా భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. యజమానుల నుంచి అంగన్‌వాడీ ఉద్యోగులకు తీవ్రమైన ఒత్తిడి ఎదురువుతోంది. ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఉద్యోగ విరమణ పొందిన అంగన్‌వాడీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.50 వేల సొమ్ము సైతం ఇవ్వని దుస్థితి నెలకొంది. అంగన్‌వాడీలు ఉద్యోగ విరమణ పొందాక కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఆన్‌లైన్‌లో చూపించడంతో ప్రభుత్వ పథకాలు ఏవీ అందకుండా పోతున్నాయి. దీంతో అంగన్‌వాడీ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.