– ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అర్కిటెక్చర్ భవనం ప్రారంభం
ప్రజాశక్తి – ఎఎన్‌యు ( గుంటూరు జిల్లా):విశ్వవిద్యాలయాల నుంచి దేశ భవిష్యత్తు నిర్దేశించే నాయకులు, పాలకులు తయారవ్వాలని రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్ వి విజరుసాయిరెడ్డి అన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ – మిషన్ లెర్నింగ్- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు ఎంపి నిధుల నుండి రూ. 50 లక్షలు మంజూరు చేసిన సందర్భంగా వర్సిటీలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. భారతదేశం ప్రపంచ దేశాల కంటే ముందుగానే నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలను నెలకొల్పిందని, వాటిల్లో విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మనదేశ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని, ఈ విధానం చాలా దురదృష్టకరమని అన్నారు. దేశంలోని విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులు, అధ్యాపకులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా విద్యావ్యవస్థలో ప్రమాణాలను మెరుగుపరచుకొని రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటనలో భాగంగా తాను కేరళలోని త్రివేండ్రం సందర్శించానని, అక్కడ గోపీనాథ్ అనే మ్యూజిషియన్ గొప్ప ఆలోచనలతో వికలాంగుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎంతో ఆలోచన, దూర దృష్టితో వికలాంగులకు మేలు చేసే విధంగా ఏర్పాటు చేసిన అటువంటి కేంద్రాన్ని నాగార్జున విశ్వవిద్యాలయంలో కూడా ఏర్పాటు చేయాలని, అవసరమైన నిధులను తాను అందజేయడంతోపాటు ఇతరుల నుండి సేకరించే బాధ్యత కూడా తాను స్వీకరిస్తానని చెప్పారు. వర్సిటీ వైస్ చాన్సలర్ పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గొప్ప మనసుతో రూ.50 లక్షలు అందజేశారని ధన్యవాదాలు తెలిపారు.