ప్రజాశక్తి ా అమరావతి బ్యూరో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న ఆహారంలో కల్తీలు, పురుగు మందులు, నాణ్యతాలోపంతో ఉన్నాయని, తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఐద్వా రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి బుధవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లబ్ధిదారులందరికీ సరుకులు సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. అక్టోబరు నెలలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఖర్జూరం ప్యాకెట్లో పాము కళేబరం ఉన్నట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. దీన్ని రబ్బరు ముక్కని అధికారులు తేల్చారని పేర్కొన్నారు. అయినా కాంట్రాక్టురును కొనసాగిస్తున్నారని వివరించారు. రాగిపిండిలో పురుగులు వస్తున్నాయని, అటుకులలో ఇసుక ఉంటోందని, చిక్కీలు మెత్తగా ఉంటున్నాయని పేర్కొన్నారు. పాలు కూడా కొన్నిసార్లు లేటుగా సరఫరా చేయడంతో పాడవుతున్నాయని వివరించారు. కోడిగుడ్లు చిన్నసైజులో ఉంటున్నాయని వివరించారు. 25 రోజులకు సరిపడా ఆహారం సరఫరా చేయాల్సి ఉండగా, 15 నుంచి 20 రోజులకు సరిపడా మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశం నెరవేరడం లేదని అన్నారు. వీటిపై వెంటనే విచారణ చేయించి లబ్ధిదారులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.