మాటతప్పిన పిఎం క్షమాపణలు చెప్పాలి
వామపక్షాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
ప్రజాశక్తి- యంత్రాంగం:ప్రత్యేక హోదా, విభజన హామీలు, కృష్ణా జలాల విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహంపై వామపక్ష పార్టీలు ఆదివారం నిరసన తెలిపాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తిరుపతికి ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ ‘మోడీ గోబ్యాక్’ అంటూ నినదించాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రధాన మంత్రి ఏ ముఖం పెట్టుకొని తిరుపతికి వస్తున్నారంటూ ప్రశ్నించాయి. మాటతప్పిన ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ‘మోడీ గోబ్యాక్’ అంటూ నల్ల చొక్కాలు, బ్యానర్లతో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన తిరుపతి జిల్లా రేణిగుంటలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురి నాయకులను పోలీసులు అరెస్టు చేసి రేణిగుంట స్టేషన్‌కు తరలించారు. నెల్లూరులో సిపిఎం ఆధ్వర్యాన మినీ బైపాస్‌లోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వరకు ర్యాలీ నిరసన నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ తదితరులు పాల్గని ప్రసంగించారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద వామపక్షాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి.ప్రకాష్, వామపక్షాల నాయకులు పాల్గన్నారు. అనకాపల్లిలో ఆర్‌టిసి కాంప్లెక్స్ ఎదుట సిపిఎం ఆధ్వర్యాన నల్లజెండాలతో నిరసన తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టడంపై, విశాఖ రైల్వేజోన్ అంశంపై ఉత్తరాంధ్ర వాసులను మోసగించడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ‘నరేంద్ర మోడీ గోబ్యాక్’ అంటూ నినదించారు. ఏలూరులోని పాతబస్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు ప్రసంగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వామపక్షాల ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు బి.బలరాం, కోణాల భీమారావు పాల్గన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సిపిఎం ఆధ్వర్యాన నల్ల జెండాలతోనూ, కాకినాడలో వామపక్షాల ఆధ్వర్యాన నల్ల బెలూన్లతోనూ నిరసన తెలిపారు.విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యాన…ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ… తిరుపతి పర్యటనను వ్యతిరేకిస్తూ విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. నల్లబెలూన్లు ఎగుర వేశారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.కృష్ణ, సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎస్‌కె నిజాముద్దీన్ తదితరులు పాల్గని ప్రసంగించారు.