అమరావతి: ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియలో సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎత్తు కొలిచే అంశంలో అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఫలితాలను నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఆర్‌ఎస్‌ఐగా పని చేసిన వ్యక్తిని కూడా ఎత్తు సరిపోలేదని తిరస్కరించారంటూ అభ్యర్థుల తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అభ్యర్థులందరి ఎత్తు తమ సమక్షంలోనే తీసుకుంటామని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్లంతా సిద్ధంగా ఉన్నారని గురువారం విచారణ సందర్భంగా శ్రావణ్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం పిటిషనర్లు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.