8 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె – యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి

Nov 21,2023 21:35 #Anganwadi Workers

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి:తమ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ ఎనిమిది నుంచి అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి తెలిపారు. కాకినాడలోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాడ్యుటీ, ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న సెంటర్ల అద్దెలు, టిఎ బిల్లులు తక్షణం చెల్లించాలని, ఆయాల ప్రమోషన్ల వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని, ఇందులో రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్‌ చేశారు. మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలని, ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను రద్దు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్‌వాడీలకు సంబంధించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, బీమా అమలు చేయాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.ఐదు లక్షలు చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ సంక్షేమ పథకాలను దూరం చేయడం దారుణమన్నారు. జీతాల చెల్లింపుల్లో మాత్రం ప్రభుత్వానికి సంబంధం లేదంటూ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తుండడం తగదన్నారు. నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం మానేసి, విజిట్ల పేరుతో ఫుడ్‌ కమిషనర్‌, అధికారులు అంగన్‌వాడీలను వేధిస్తున్నారని విమర్శించారు. 2017 నుంచి టిఎ బిల్లులు చెల్లించకపోతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సమస్యలపై వివిధ రూపాల్లో నిరసన తెలిపినా స్పందన లేకపోవడంతో రాజ్యాంగం కల్పించిన పోరాడే హక్కు ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పోరాటానికి ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్‌ కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దడాల పద్మ, చంద్రావతి, ఉపాధ్యక్షులు బాలం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️