కారు ఇంజిన్‌లో అక్రమంగా నగదు తరలింపు… ఇంతలో…!

Nov 25,2023 13:08 #car, #cash, #engine, #Illegal, #movement

మామునూరు (వరంగల్‌) : కారు ఇంజిన్‌లో అక్రమంగా నగదును తరలిస్తుండగా… అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడంతో భయాందోళనకు గురైన కారులోనివారు బయటకు పరుగు లంకించుకున్నారు.. ఇంతలో… వెనక కారులో వస్తున్న వేరే వ్యక్తి ఆ డబ్బు సంచిని పట్టుకుపోయాడు..! ఈ ఘటన శుక్రవారం వరంగల్‌ సమీపంలో వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది.

పోలీసుల కథనం మేరకు … కొందరు దుండగులు కారు ఇంజిన్‌ బానెట్‌ కింద నగదును అమర్చి తరలిస్తున్నారు. వరంగల్‌ నుంచి వర్ధన్నపేట వైపు వెళుతున్న కారు బొల్లికుంట క్రాస్‌ రోడ్‌ వద్దకు చేరుకోగానే అందులోంచి దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో కారులో ఉన్నవారు వెంటనే కారును, డబ్బును వదిలేసి పరారయ్యారు. అందులోని కొంత డబ్బు దగ్ధమవ్వగా.. వెనుకనే మరో కారులో వచ్చిన వ్యక్తి ఆ నోట్ల కట్టల సంచిని తన వెంట తీసుకెళ్లిపోయాడు. కారులో తరలిస్తున్న డబ్బు రూ.50 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రవీందర్‌, మామునూరు ఏసీపీ సతీష్‌బాబు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ డబ్బు ఎవరిది, ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారు, తరవాత నోట్ల సంచిని తీసుకెళ్లింది ఎవరు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు మణిరాజు చకిలీల పేరుతో మూసారాంబాగ్‌ చిరునామాపై ఉందని పోలీసులు గుర్తించారు. రోడ్డుపై పడిపోయిన నోట్లను కొందరు తీసుకెళ్లినట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికే ఇంతమొత్తంలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

➡️