తెలంగాణ: . బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోకుంటే రాష్ట్రానికే భవిష్యత్తే ఉండదని, సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరియేట్ ఎందుకు..? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నిక దొర తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతోన్న యుద్దం అన్నారు. ముదిగొండ మండలం ఖానాపురం గ్రామంలో భట్టి కార్నర్ మీటింగ్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా మధిరలో ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి పదేళ్లు కావస్తోన్నా.. సీఎం, మంత్రులు సెక్రటేరీయేట్టుకు రావడం లేదని అన్నారు. సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరీయేట్ ఎందుకు..? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని తెలిపారు. కాళేశ్వరం పేరుతో రూ. 1లక్ష కోట్లు.. మిషన్ భగీరధ పేరుతో రూ. 50 వేల కోట్లు నిరుపయోగం చేశారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని మేం గొంతు చించుకుని అరిచాం.. గళమెత్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోకుంటే రాష్ట్రానికే భవిష్యత్తే ఉండదని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దించుదాం.. టీఆర్‌ఎస్ నేతలను దంచుదాం.. సంపదను ప్రజలకు పంచుదామన్నారు.
ఇళ్ల స్థలం ఇవ్వనున్నాం.. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణ మాఫీ ఇస్తామన్నారు. రైతులకే కాదు.. రైతు కూలీలను ఆదుకునే పథకాలు మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ప్రతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోదాలిస్తామని తెలిపారు. పేదలు గెలవాలంటే కాంగ్రెస్ గెలవడమే అని తెలిపారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. విద్యార్థుల కోసం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని తెలిపారు. విద్యార్థినులకు బ్యాటరీ స్కూటర్ పంపిణీ చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకుందామని భట్టి తెలిపారు.