రైతుబంధు ఆపాలని తాను ఎక్కడా ఫిర్యాదు చేయలేదు : ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Nov 18,2023 16:09 #press meet, #uttam kumar reddy

తెలంగాణ: ఓటమి భయంతోనే కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ మాజీ చీఫ్‌, కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ చెబుతున్నట్లుగా రైతుబంధు ఆపాలని తాను ఎక్కడా ఫిర్యాదు చేయలేదన్నారు. నామినేషన్‌ ప్రక్రియకు ముందే రైతు బంధు, ఇతర పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు నిధిని పెంచాలన్నారు. రైతుబంధును ఆపాలని తానుగానీ, కాంగ్రెస్‌ నేతలుగానీ కోరలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నిర్మించిన ప్రాజెక్టులు 70 ఏళ్లుగా లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నా చెక్కు చెదరలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాసిరకం నిర్మాణం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని ఆరోపించారు.
నీళ్లు రాకముందే ప్రాజెక్టులు కూలిపోతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ముచ్చటగా మూడోసారి రిస్క్‌ తీసుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఈసారి కేసీఆర్‌ ను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారని అన్నారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్‌ కుటుంబం ఓట్లు అడగాలని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ప్రారంభించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వబోతున్నామన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ రైతులకు ద్రోహం చేశారన్నారు.

➡️