ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ :రాష్ట్రంలో నెలకొన్న కరువుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కేంద్రానికి కరువు నివేదికలు పంపాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో ఎపి మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభకు వచ్చిన ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 446 మండలాల్లో కరువు ఉంటే కేవలం 103 మండలాలనే ప్రకటించడం దారుణమని తెలిపారు. రాష్ట్రంలో కరువు లేదని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించడం సిగ్గుచేటన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో నీళ్లు అడుగంటాయని తెలిపారు. రాష్ట్రంలో వలసలను నివారించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సింది పోయి కరువుపై అవాకులు, చవాకులు పేలడం దారుణమన్నారు. ఛీప్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కరువు నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి పంపడానికి వెనుకడుగు వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కరువుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20, 21న విజయవాడలో 30 గంటల నిరసన ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. నూజివీడు భూముల పట్టాల పంపిణీలో జగన్‌మోహన్‌రెడ్డే భూములు పంచి పట్టాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, జగన్ పార్టీ, ఆయన పుట్టకముందే కమ్యూనిస్టులు పోరాటాలు చేసి సాధించుకున్న భూములను పేదలకు పంచి పట్టాలు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు, పట్టణ కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.