ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు : నలుగురికి తీవ్రగాయాలు

Nov 24,2023 11:49 #four members, #gas leak, #injured, #visaka

విశాఖ : ఇంట్లో వంట గ్యాస్‌ లీకవ్వడంతో దీపారాధనకు అగ్గిపుల్ల రాజేయగానే మంటలు వ్యాపించి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే …. విశాఖలోని మధురవాడ వాంబే కాలనీలో బాలరాజు, అతని భార్య చిన్ని, కుమారులు గిరి, కార్తిక్‌లతో నివాసముంటున్నారు. బాలరాజుతోపాటు తన ఇద్దరు కుమారులు భవానీ మాలధారణ ధరించి ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున వంట గ్యాస్‌ అయిపోవడంతో.. కొత్త సిలిండర్‌కు అతడు రెగ్యులేటర్‌ను అమర్చాడు. కానీ రెగ్యులేటర్‌ను సరిగ్గా అమర్చకపోవడంతో గ్యాస్‌ లీకై ఇల్లంతా వ్యాపించింది. వారు ఉదయాన్నే లేచి గ్యాస్‌ లీక్‌ను గమనించక పూజ చేసేందుకు సిద్ధమయ్యారు. పూజ కోసం దేవుడి చిత్రపటాల దగ్గర దీపారాధన చేయడానికి దీపాన్ని వెలిగించడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వస్తువులన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు 108 వాహనంతోపాటు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. పిఎం పాలెం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కెజిహెచ్‌కు తరలించారు. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️