- ఇందుకు అందరూ కంకణబద్ధులు కావాలి
- చట్టసభల్లో ఎర్రజెండా అవసరం : సీతారాం ఏచూరి
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దేశాన్ని సర్వనాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మోడీని గద్దె దించితేనే దేశానికి భవిష్యత్తని తెలిపారు. ఇందుకోసం అందరూ కరకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యాన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వేములపల్లి నుంచి వాడపల్లి వరకు వేలాది వాహనాలతో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్‌పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ వరకు రోడ్ షో సాగింది. రెడ్ షర్టులు ధరించి అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. మిర్యాలగూడ ఎరువుమయమైంది. ఓపెన్ టాప్ జీపులో ఏచూరి, జూలకంటి రంగారెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం రాజీవ్ చౌక్‌లో జరిగిన సభలో ఏచూరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పజెప్పు తూ ప్రజాసంక్షేమాన్ని మరిచిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని, పౌర హక్కులను రద్దు చేసి తమ సొంత అజెండాను ప్రజలపై రుద్దేందుకు చూస్తోందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ఎర్రజెండాతోనే సాధ్యమవు తుందని తెలిపారు. నేడు పాలకులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారని, డబ్బు ఉన్న వారే పోటీ చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పదవుల కోసం పార్టీల ఫిరాయింపులు చేస్తున్నారని, అలాంటి వారిని ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో తమ పార్టీ ఉందని, తెలంగాణలో కాంగ్రెస్‌తో సర్దుబాటు కుదరకపోవడానికి ఆ పార్టీయే కారణమని తెలిపారు.అనివార్య పరిస్థితిల్లో సిపిఎం ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 చోట్ల పోటీ చేస్తున్న సిపిఎం నాయకులను గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు. మీ కోసం మీ రంగన్నను గెలిపించుకో వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తీగల సాగర్, శ్రీరామ్ నాయక్, రమ, ఎంవి.రమణ, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, ఐలూ రాష్ట్ర కార్యదర్శి అనంతుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.