- వంతపాడుతున్న పార్టీలు ఆలోచించుకోవాలి
- కార్మిక, కర్షక ఐక్య ఉద్యమాలు బలోపేతం
- మహాధర్నాలో నాయకుల పిలుపు
- ఉత్సాహంగా పాల్గొన్న రైతులు, కార్మికులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతుల, కార్మికుల, వ్యవసాయ కార్మికుల బతుకులపై ముప్పేటా దాడి చేస్తున్న కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని ఎపి కార్మిక సంఘాల ఐక్య వేదిక, ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి సోమవారం విజయవాడలో నిర్వహించిన సంయుక్త మహా ధర్నా పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని, లౌకిక, ప్రజాస్వామ్యాన్ని, పౌరుల హక్కులను కాలరాస్తున్న బిజెపి ఓటమి లక్ష్య సాధనలో తొలిమెట్టు ఈ మహాధర్నా అని పేర్కొంది. మోడీ వినాశకర విధానాలతో దేశం ప్రమాదంలో పడిందని, బిజెపిని ఓడించి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మిక, కర్షకులపై ఉందని ధర్నాలో ప్రసంగించిన కార్మిక, కర్షక నేతలు నొక్కి చెప్పారు. మోడీ విధానాలను చంకనేసుకొని మోస్తున్న ఈ రాష్ట్రంలోని పార్టీలు వాస్తవాలు తెలుసుకొని ప్రజలతో కలిసి రావాలని, లేకపోతే ఆయా పార్టీలకు సైతం బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులో రైతులు సంవత్సరంపాటు వీరోచితంగా ఉద్యమించి వెనక్కికొట్టారు. చట్టాల రద్దు సందర్బంలో కేంద్ర సర్కారు రైతులకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదు. దాంతో నాడు రైతు పోరాటం ప్రారంభించిన నవంబర్ 26 స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా ఆందోళనలకు ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చాయి. అందులో భాగంగా విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో 27,28 తేదీలలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి మహాధర్నా చేపట్టారు. ధర్నాకు రైతు సంఘాల కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కార్మిక సంఘాల నేతలు జి. ఓబులేషు, సిహెచ్ నర్సింగరావు అధ్యక్షతవర్గంగా వహించారు.
- ఎవడబ్బ సొమ్మని కార్పొరేట్లకు రుణ మాఫీ: వడ్డే
రైతుల రుణాలు మాఫీ చేయమంటే నిరాకరించిన మోడీ ప్రభుత్వం, ఎవడబ్బసొమ్మని బ్యాంకుల్లో కార్పొరేట్లు తీసుకున్న రూ.14.50 లక్షల కోట్లు మాఫీ చేసిందని ప్రశ్నించారు. ‘చిన్న రాష్ట్రమైనా కేరళ రుణ విమోచన చట్టం తెచ్చి రైతుల ఆత్మహత్యలను నివారించింది. అటువంటి చట్టం కేంద్రం ఎందుకు తీసుకురాదు? దశాబ్దాలుగా కార్మికులు సాధించుకున్న చట్టాలను తీసేసి కోడ్లు తెచ్చి వారికి ఉన్న కనీస హక్కులు కాలరాసింది’ అని అన్నారు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, వాటికి భయపడకుండా కార్మిక, కర్షక ఉద్యమాలకు ప్రచారం కల్పించాలని కోరారు. అధిక సంఖ్యలో వచ్చిన మహిళల ఉత్సాహాన్ని చూస్తుంటే మోడీని గద్దె దించగలమన్న విశ్వాసం పెరిగిందన్నారు.
- సమరశంఖం
సిఐటియు నాయకులు వి ఉమామహేశ్వరరావు ప్రసంగిస్తూ సంఘీభావ దశ నుంచి కార్మిక, కర్షక ఐక్య సమరశంఖం పూరించే స్థాయికి ధర్నా విస్తృతం చెందింది. అందుకే ఈ రోజు ప్రజా ఉద్యమాలకు చారిత్రక దినమని చెప్పారు. ‘ప్రజలకిచ్చిన హామీల అమలుపై ఆ ఒక్కటి అడగకు అంటున్న మోడీ, కార్పొరేట్ల పెరుగుదల తన వల్లనే జరిగిందంటున్నారు. ఆయన ఎవరి కోసం పని చేస్తున్నారో ఈ ఉదంతంతో అర్థమవుతుంది’ అని అన్నారు. అన్ని విధాలా అన్యాయం చేస్తున్న మోడీని ఇంటికి పొమ్మనే హక్కు కార్మిక, కర్షకులకే ఉందన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మోడీని బలపర్చడానికి ఆతృత పడటం మానేసి ప్రజలపక్షం వహించాలన్నారు. ఎఐకెఎస్ జాతీయ నాయకులు రావుల వెంకయ్య మాట్లాడుతూ అజాత శత్రువు అలిగిన నాడు సాగరములన్నీ ఏకమవుతాయన్నట్లు రైతులు ఆగ్రహిస్తే మోడీ సర్కారు దిగిపోవడం ఖాయమన్నారు. స్వామినాథన్ సిఫారసు మేరకు రైతులకు సి2+50 శాతం ఎంఎస్‌పిని గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలని చుండూరు రంగారావు తీర్మానం ప్రవేశపెట్టారు.
- వైజాగ్ స్టీల్ అమ్మకాన్ని ఎదిరించాలి
కొన్ని దశాబ్దాల్లో కార్మికుల, ఉద్యోగుల సమిష్టి శ్రమ వలన వైజాగ్ స్టీల్ ఆస్తుల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరిందని, అటువంటి సంస్థను కేంద్రం కారుచవకగా అమ్మాలని చూస్తోందని, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలను ఏకతాటికొచ్చి అడ్డుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. ఓట్ల కోసం పగటి వేషగాడి అవతారం ఎత్తడం మోడీకి అలవాటని, ఆయన్ని, ఆయనకు మద్దతిచ్చే ఈ రాష్ట్రంలోని పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఎఐటియుసి నేత జి ఓబులేషు అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల కోసం బిజెపి తెచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లును కేంద్రం ఉపసంహరించాలని ఇఫ్టూ నాయకులు జాస్తి కిషోర్ కోరారు. అనంతపురం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్లకు జగన్ ప్రభుత్వం మీటర్లు అమర్చదలిస్తే రైతులు తీవ్రంగా ప్రతిఘటించారని, ఆ స్ఫూర్తిని రాష్ట్రమంతా కనబర్చాలని ఎం గిరీష్ చెప్పారు.
- అరకొర జీతాలే దేశభక్తా?
ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న స్కీం వర్కర్లకు అరకొర జీతాలివ్వడమేనా మోడీ దేశభక్తి అని ఎపి అంగన్‌వాడీ సంఘ రాష్ట్ర నేత కె సుబ్బరావమ్మ ప్రశ్నించారు. విసిగివేసారిన అనంతరం ఈ నెల 8 నుంచి అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెకు మద్దతివ్వాలని లలితమ్మ కోరారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు నేత కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతుల స్థితిగతులపై అధ్యయనానికి వేసిన కమిషన్లు ఆత్మహత్యలను ఆపలేకపోయాయని ఎపి కౌలు రైతు సంఘం కార్యదర్శి ఎం హరిబాబు చెప్పారు. విధానాలు మారినప్పుడే ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. కౌలు రైతులకు రుణాలు, ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని పి జమలయ్య, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఎపికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పున్ణపంపిణీని వ్యతిరేకించాలని ఆళ్ల గోపాలకృష్ణ, కేరళ తరహాలో కేంద్రం రైతు రుణ విమోచన చట్టం తేవాల్సిన ఆవశ్యకత ఉందని ఎపి రైతు సంఘం నేత వై కేశవరావు, ప్రభుత్వ స్కీం వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని శ్రామిక మహిళ రాష్ట్ర నేత కె ధనలక్ష్మి, మోడీ ప్రభుత్వ విధానాలతో చిన్న, సన్నకారు రైతులు సేద్యం సాగించలేక చితికిపోతున్నారని ఎపి రైతుసంఘం అధ్యక్షులు వి క్రిష్ణయ్య చెప్పారు. మొదటి రోజు ధర్నాలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలకు చెందిన పలువురు నాయకులు ప్రసంగించారు. తొలుత ఆహ్వానితులను వై కేశవరావు వేదిక మీదికి ఆహ్వానించారు. ఐలు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అజరుకుమార్ నేతృత్వంలో లాయర్లు ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో, లఖింపూర్‌ఖేరి ఘటనలో, ఇటీలికాలంలో రైతు పోరాటాల్లో అశువులు బాసిన వారికి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, రైతు ఉద్యమ నేత ఎం శంకరయ్య, ఎర్నేని నాగేంద్రనాథ్, చెరుకూరి వీరయ్య మృతికి సంతాపం తెలుపుతూ ఎపి రైతుసంఘం నేత కెవివి ప్రసాద్ తీర్మానం ప్రవేశపెట్టారు. మహాధర్నాలో ప్రజానాట్యమండలి, ఎపి ప్రజానాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక మండలి కళాకారులు ఆలపించిన గేయాలు, కళా రూపాలు ధర్నాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి కూడా కొనసాగాయి.