ఎర్రజెండాకేసే ప్రతి ఓటూ ఓ తూటా

Nov 20,2023 11:12 #CPM AP

బయట పోట్లాడుతాం – సభలో నిలదీస్తాం
ప్రజల గోస పట్టని పార్టీలకెందుకు ఓటెయ్యాలి
రాజ్యాంగాన్ని పాతాళానికి తొక్కుతున్న బిజెపిని కెసిఆర్‌ ప్రశ్నించగలరా?
అమీన్‌పూర్‌ బహిరంగ సభలో బివి రాఘవులు
ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో : 
  ఎర్రజెండాకు వేసే ప్రతి ఓటూ పాలకుల గుండెల్లో పేలే తూటా లాంటిదని, ప్రజల సమస్యలపై పోరాడేందుకు మరింత శక్తిని పెంచేందుకు దోహదపడుతుందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సమస్యలపై బయట పోట్లాడుతామని, చట్టసభల్లో మాట్లాడుతామని అని స్పష్టం చేశారు. ఓట్లు, సీట్లు వచ్చినా రాకపోయినా కార్మిక వర్గం, పేదల ప్రయోజనాల కోసం పోరాడుతామని తెలిపారు. ఇతర పార్టీలేవైనా బయటా, చట్టసభల్లో ప్రజల గురించి ఆలోచిస్తాయా? అని ప్రశ్నించారు. పటాన్‌చెరు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జె.మల్లికార్జున్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని బీరంగూడ మండే మార్కెట్‌లో నాయకులు నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడారు. ‘మేముండడానికి ఇళ్లుఇచ్చారా? మేం బతకాడిని మా జీతం పెంచారా? పిఎఫ్‌, ఇఎస్‌ఐ సదుపాయం కల్పించారా? మా పేదరికం పోయేందుకు ఆలోచించారా? ఇన్నాళ్లు పాలించి ఏం చేశారో చెప్పండి’ అంటూ పాలక పార్టీలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశ్రమల యజమానులకు సాయపడడం తప్ప ఏనాడైనా కార్మికులు, పేదల గురించి మాట్లాడని, పోరాడని పార్టీల అభ్యర్థులిచ్చే నోట్ల కట్టలకు ఆశపడితే మన భవిష్యత్‌ నాశనమై గోస పడతామన్నారు. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల పరంగా వేరైనప్పటికీ విధానాల పరంగా రెండు ఒక్కటేనని వివరించారు. రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాలు బిజెపి అమలు చేసే ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేయకుండా అడ్డుపడగలవా? అని ప్రశ్నించారు. ఎతైన అంబేద్కర్‌ విగ్రహం పెడితే చాలదని, ఆయన ఆశయాలను దెబ్బతీస్తోన్న బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. బిజెపికి కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలు తప్ప కార్మికుల సమస్యలు పట్టవని తెలిపారు. అదానీ లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని బయటకు పంపించి తెల్లధనంగా మార్చుకున్నట్టు ఆధారాలు బయటపడినా విచారణ సంస్థలు మాత్రం ఆయనకు క్లీన్‌ చీట్‌ ఇవ్వడం శోచనీయమన్నారు. బిజెపి, కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ చరిత్రను అర్థం చేసుకోవాలని, నిజాయితీగా పనిచేసే ఎర్రజెండా అభ్యర్థికి ఓటేయాలని ప్రజలను కోరారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారని, వీరికి కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి సదుపాయాల కోసం సిపిఎం నికరంగా పోరాడిందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, పేదల కష్టాలు తెలిసిన మల్లికార్జున్‌ను గెలిపించుకోవడం ద్వారా ప్రభుత్వంతో కొట్లాడి సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

➡️