ప్రజాశక్తి -అమరావతి బ్యూరో సచివాయాల్లో నియమితులైన ఎనర్జీ అసిస్టెంట్ల (ఎనర్జీ సెక్రటరీ గ్రేడ్-2) పరిస్థితి గందరగోళంగా మారింది. వారు ఏ శాఖ పరిధిలోకి వస్తారన్న విషయమై ఇప్పటికీ అయోమయం కొనసాగులోంది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉద్యోగులా… లేక విద్యుత్‌శాఖ ఉద్యోగుల అన్న విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,329 మంది ఎనర్జీ అసిస్టెంటుగా ప్రభుత్వం నియమించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసేందుకు వాటర్ వర్క్స్, వీదిలైట్లు, విధ్యుత్‌పోల్స్ మరమ్మతులువ వంటి పనులు చేసేందుకు ఎనర్జీ అసిస్టెంట్లను రిక్రూట్ చేసింది. నోటిఫికేషన్ సమయంలో సచివాలయ ఉద్యోగులకు డిగ్రీ అర్హత కాగా, ఎనర్జీ అసిస్టెంట్లకు ఐటిఐ అర్హత ఉన్న వారిని ఎంపిక చేసింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌తో కలిపే ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టుల ఖాళీలను చూపించారు. రిక్రూట్‌మెంట్‌ను ట్రాన్స్‌కో నిర్వహించింది. ఆచరణలో గ్రామ సచివాలయ ఉద్యోగుల జాబ్‌ఛార్ట్ కాకుండా ట్రాన్స్‌కో అధికారుల పర్యవేక్షణలో షిప్ట్‌ల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై పనిభారం పెరిగింది. గ్రామ వార్డు సచివాలయాలశాఖలో వర్తిస్తున్న సిఎల్, ఇఎల్స్‌ను వారికి వర్తింపజేయడం లేదు. వారితోపాటు రిక్రూట్ అయిన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయి రెగ్యులర్ ఉద్యోగులుగా మారారు. ఎనర్జీ అసిస్టెంట్లు మాత్రం ట్రాన్స్‌కో పరిధిలో విధులు నిర్వహిస్తుండటంతో వారికి ఇంకా రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. అయితే ప్రతి రోజు ఉదయం స్రచివాలయంలో బయోమెట్రిక్ వేసిన అనంతరం డ్యూటీలు చేసేందుకు సంబంధిత ట్రాన్స్‌కో ఎఇ, డిఇ వద్దకు వెళుతున్నారు. ఇది ఇబ్బందిగా ఉందని ఎనర్జీ అసిస్టెంట్లు చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాన్ని చెల్లిస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్లకు మాత్రం విద్యుత్తు శాఖ చెల్లిస్తోంది. స్తంభాలు ఎక్కి ప్రమాదాలకు గురై మరణించినా, తీవ్ర గాయాల పాలైన గామవార్డు సచివాలయశాఖ నుండిగానీ, విద్యుత్‌శాఖ నుండిగానీ ఎటువంటి సాయం అందడం లేదు. అందువల్ల తాము ఏ శాఖ ఉద్యోగులమో తేల్చి, ఆ జాబ్‌ఛార్ట్ ప్రకారం తమకు జీతాలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని వారు కోరుతున్నారు.