పంటలపై ఏనుగుల దాడి

Nov 20,2023 21:26 #elephant

ప్రజాశక్తి- వికోట (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా వికోట మండలంలోని నాగిరెడ్డిపల్లి, రామకుప్పం మండల పరిధిలోని ననియాల, నారాయణపురం తాండా గ్రామ అటవీ శివార్లలోని పంటలను ఏనుగులు ఆదివారం ధ్వంసం చేశాయి. నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు బోయకొండప్ప రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున 15 ఏనుగుల గుంపు గ్రామ శివారులోని పంటను తిన్నంత వరకు తిని తొక్కి ధ్వంసం చేశాయి. దీనివల్ల సుమారు రూ.50 వేలకు పైగా నష్టం వాటిల్లిందని, కోత దశలో ఉన్న పంటను ఏనుగులు తొక్కి నేలమట్టం చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రామకుప్పం మండల పరిధిలోని కామరాజు నాయక్‌, రాఘవ నాయక్‌, గోవిందస్వామి నాయక్‌, శిన నాయక్‌లకు చెందిన వరి, రాగి, అరటి పంటలను ఆదివారం అర్ధరాత్రి ఏనుగులు నాశనం చేయడమే కాక వ్యవసాయ పరికరాలను కూడా ధ్వంసం చేశాయి. ఈ ఘటనల నేపథ్యంలో రైతులు రాత్రి సమయాల్లో పంటపొలాల వైపు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. అప్పులు చేసి సాగు చేశామని ఏనుగులు నాశనం చేయడంతో వేల రూపాయలతో నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాశ్వతమైన నివారణ చర్యలు తీసుకోవాలని, తమకు నష్టపరిహారం అందివ్వాలని వారు కోరుతున్నారు.
గజ దాడుల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి
ఏనుగుల దాడుల్లో భారీగా రైతులు నష్టపోతున్నారని, వారిని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. నాశనమైన పంటను సిపిఎం నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ జిల్లాలోని పలమనేరు, వికోట, రామకుప్పం, సోమల, సదుం, బైరెడ్డిపల్లి మండలాలు అటవీ సరిహద్దున ఉండటంతో తరచూ గ్రామాల్లోకి వచ్చి ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయన్నారు. దీంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏనుగులు పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి చొరబడుతున్నాయని, వాటిని అరికట్టడంలో సరైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు.

తాజా వార్తలు

➡️