అన్నదాతలకు భారీ నష్టం
ప్రజాశక్తి-వి కోట : గత నాలుగు రోజులుగా అటవీ సరిహద్దు పంట పొలాల్లో చొరబడుతున్న ఏనుగుల దాడులతో పంటలకు అపార నష్టం కలుగుతున్నాయి. పూత కోత దశ పంటలను నేలమట్టము చేస్తు అన్నదాతలకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. శుక్రవారం రాత్రి మండలంలో ఏనుగుల మంద పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. తొక్కి, తిని ధ్వంసం చేస్తున్నాయి. మండల పరిధిలో 14 ఏనుగుల గుంపు నాలుగు రోజులుగా తోటకనుమ, కొమ్మరమడుగు, నాగిరెడ్డిపల్లి, వెంకటేపల్లి, దానమయ్యగారిపల్లి, ఎడగురికి, పచ్చారమాకులపల్లి, సికార్లపల్లి తదితర అటవీ సరిహద్దు గ్రామల పంటపొలాల్లోకి చొరబడుతున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి.ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పచ్చ రుమాకులపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ ఎకరం టమోటా ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. ఉదయం కోత కోద్దామనుకొని వెళ్లిగాతోట నేలమట్టమయింది రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం టమోటా ధర 10 కిలోలు 500 రూపాయలకు పైగా పలుకుతున్నాయి. ఈ దశలో ఏనుగుల గుంపు తోటపై పడి తిని తొక్కి ధ్వంసం చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.సీకర్లపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం రెండెకరాల్లో టమోటా పంట చేశాడు. పంట పూత పిందె దశలో రాత్రి ఏనుగుల గుంపు పంటపై విరుచుకుపడి నేలమట్టం చేసితీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొమ్మరమడుగు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి పంట సాగు చేసేందుకు వేసిన మల్చింగ్ పేపర్ ను తొక్కి చించి వేశాయి. యడగురికి గ్రామానికి చెందిన రైతు అబ్బయ్య అరటి,మామిడి తోటపై దాడి చేసి విరిచేసాయి. నాగిరెడ్డిపల్లి రైతు వెంకటాచలపతి వరి మడిని తొక్కి తిని నాశనం చేశాయి. పలువురి రైతులకు చెందిన డ్రిప్ పరికరాలు ధ్వంసం చేశాయి. మొక్కజొన్న పంటలను తొక్కేసాయి. గజరాజులు నాలుగు రోజులుగా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏ పంటపై పడి ధ్వంసం చేస్తాయో అన్న భయాందోళన రైతుల్లో నెలకొంది. సంబంధిత అటవీ శాఖ అధికారులు సత్వరం స్పందించి ఏనుగులు పంట పొలాలపైకి రాకుండా చర్యలు చేపట్టి పంట నష్టపరిహారాన్ని అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.