ప్రజాశక్తి – గడివేముల (నంద్యాలజిల్లా)నంద్యాల జిల్లా గడివేములలో గత వారం రోజులుగా రైతులకు తెలియకుండా, రైతుల అభిప్రాయ సేకరణ లేకుండా రాత్రికి రాత్రే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం దారుణమని ఎపి రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడివేముల మండల కేంద్రంలోని పొలాల్లో బిగించిన మీటర్లను రైతు సంఘం నేతలు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్ రైతులతో మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు రాత్రికి రాత్రే దొంగల్లాగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం దారుణమన్నారు. సకాలంలో వర్షాలు పడక, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో మీటర్లు బిగించి రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ షరతులకు తలగ్గి వైసిపి ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరి బిగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ మోటార్లకు బిగించిన మీటర్లను తొలగించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున రైతులతో తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరలో విజయవాడలో రైతులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద స్వామి, గోకారి, మహిళా రైతులు కూలీలు పాల్గొన్నారు.