లక్ష్మీపురంలో డయేరియా విజృంభణ

Nov 27,2023 17:57 #CPM AP, #Health Sector, #Kurnool, #YCP Govt
diarrhea in lakshmipuram
  • 100 మందికిపైగా అస్వస్థత
  • తాగునీరు కలుషితమే కారణమంటున్న గ్రామస్తులు

ప్రజాశక్తి – కర్నూలు : హాస్పిటల్‌కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి నుంచి డయేరియా విజృంభించింది. బిసి కాలనీకి చెందిన వంద మందికి పైగా వాంతులు, విరేచనాల బారిన పడి కదలలేని పరిస్థితిలో ఉన్నారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారు. దీంతో గ్రామస్తులు అంబులెన్స్‌ సహకారంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి కొందరిని, ఉలిందకొండ పిహెచ్‌సికి మరికొందరిని, సబ్‌ సెంటర్‌కి ఇంకొందరిని చికిత్స నిమిత్తం తరలించారు. డయేరియా బారిన చిన్నారులకు కర్నూలు జిజిహెచ్‌లోని పిల్లల వార్డులో చికిత్స అందిస్తున్నారు. తాగునీటి కలుషితం వల్లే డయేరియా ప్రబలినట్లు స్థానికులు చెబుతున్నారు. మురుగునీరు మొత్తం రింగ్‌బావి వద్దే ఇంకిపోవడంతో తాగునీరు కలుషితం అవుతోందని, ఈ నీటిని వినియోగిస్తున్న బిసి కాలనీ ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండు రోజులుగా డయేరియా వ్యాప్తి చెందుతున్నా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టలేదని, కేవలం బాధితులకు గ్లూకోస్‌ బాటిల్స్‌ ఎక్కించడం తప్ప మెరుగైన వైద్య సేవలు అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్‌దేశారు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి నిర్మల, కెవి నారాయణ పరామర్శించారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే అతిసార ప్రబలిందని వారన్నారు. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధి నుండి కార్పొరేషన్‌లోకి విలీనమైన తరువాత ఆ గ్రామ ప్రజలకు ఒరిగిందేమి లేదని తెలిపారు.

➡️