అమరావతి: మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. మత్స్యకారుల బతుకుల్ని ఛిద్రం చేసిన ఘనత జగన్ రెడ్డికే సొంతం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014-19 ఐదేళ్ల కాలంలోనే ఏకంగా రూ.788.38 కోట్లను ఖర్చు చేశాం.. ఆదరణ పథకం కింద వలలు, పడవలు, ఐస్ బాక్సులు సహా ఇతర వృత్తి పరికరాలను 90శాతం సబ్సిడీతో అందించామన్నారు. ఇన్ ల్యాండ్ సొసైటీ మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీతో వలలు, పడవలు అందించామని అచ్చెన్నాయుడు అన్నారు.
డీప్ సీ ఫిషింగ్ నెట్స్, ఏరియేటర్స్, ఇన్లాండ్ నెట్స్, ఇన్లాండ్ బోట్స్, ఫైబర్ బోట్స్, గిల్ నెట్స్, రిఫర్ వ్యాన్స్, సముద్రపు పంజరాలు అందించామని పేర్కొన్నారు. మత్స్యకారుల పిల్లల చదువుల కోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు. వేటకు వెళ్లి మరణించిన వారికి నెల రోజుల్లోనే డెత్ సర్టిఫికెట్ అందించి రూ. 5 లక్షల బీమా కల్పించామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లను మత్స్యకార సొసైటీలకు కాకుండా బహిరంగ వేలం వేసేలా జీవో నెం.217 తెచ్చి మత్స్యకారుల పొట్టకొట్టారు.. రాష్ట్రంలోని మత్స్యకారులకు, మత్స్యరంగానికి మెరుగైన రోజులు రావాలంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలందరిపైనా ఉంది అని అచ్చెన్నాయుడు చెప్పారు.