– ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల లోగో ఆవిష్కరణ
ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్‌కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల లోగోను బుధవారం నగరంలోని కార్మిక కర్షక భవన్‌లో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి, చీఫ్ ప్యాట్రన్స్ శివరాం ప్రసాద్, మల్లెలపుల్లారెడ్డి, జి.రామకృష్ణ, ఇరిగినేని పుల్లారెడ్డి, జెఎన్.శేషయ్య, జె.నాగేశ్వరరావు, టి.రాముడు ఆవిష్కరించారు. డిసెంబర్ 15, 16, 17న నిర్వహించే ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 103 మండలాలను మాత్రమే ప్రకటించడం సరికాదన్నారు. ప్రభుత్వం పున్ణ పరిశీలించి గ్రామాల వారీగా అధ్యయనం చేసి కరువు మండలాలను ప్రకటించాలని కోరారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 15న ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సందర్భంగా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఆహ్వాన సంఘం నాయకులు శివరాం ప్రసాద్ మాట్లాడుతూ.. కృష్ణ, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ నీటిపారుదల రంగాన్ని పాలకులు విస్మరించడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందన్నారు. మల్లెలపుల్లారెడ్డి మాట్లాడుతూ.. రైతును విస్మరించడం వల్లనే అప్పులపాలై చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జి. రామకృష్ణ మాట్లాడుతూ.. డిసెంబర్ 15న జరిగే ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు.