ప్రతి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి

cpm-protest-at-anantapur-collector-office

కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం వినూత్న ధర్నా.
ప్రజాశక్తి-అనంతపురం : పంటనష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని, వాస్తవ సాగులో ఉన్న కౌలు రైతులకు పరిహారం చెల్లించాలని, బ్యాంకు రైతుల అప్పులు మాఫీ చేసి, ఉపాధి హామీ పనులు 200 రోజులు, రోజు కూలీ రూ.600లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం ధర్నా చేపట్టింది. ఎండిపోయిన పత్తి, కంది, వేరుశెనగ పంటలతో నగరంలో ప్రదర్శన చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు రాకపోవడంతో వేరుశెనగ, కంది, పత్తి, ఆముదం, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు పూర్తిగా నష్టపోయాయన్నారు. జిల్లాలోని మొత్తం 31 మండలాలకు గాను 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పంట నష్టపరిహారం అంచనాల కోసం ఈ నెల 14న జీవో నెంబర్ 5 విడుదల చేసింది. ఇందులోని నిబంధనలు రైతులకు ఉపసమనం కలిగించే విధంగా లేకపోగా తీవ్ర నష్టం చేస్తాయి. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సమయంలో 33 శాతం పైగా పంటనష్టం జరిగి ఉండాలని, గరిష్టంగా రెండు హెక్టార్లకు మాత్రమే పరిహారం ఇవ్వాలని, వేరుశెనగ, పత్తి పంటల పెట్టుబడి ఖర్చు ఎకరాకు రూ.45 వేలు అవుతుండగా ప్రస్తుత నిబంధనల వల్ల ఎకరాకు కేవలం రూ.6,800 లు మాత్రమే అందుతుంది. అలాగే ఇతర పంటల పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా రైతులను ఆదుకునే విధంగా లేదు. పంటల సాగుకు బ్యాంకులు పెట్టుబడి రుణం ఇవ్వడానికి నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాము. వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని, రోజుకు రూ.600 ల వేతనం ఇవ్వాలి. వంటసాగుచేసిన కౌలు రైతులకే పంటనష్టపరిహారం అందివ్వాలని, రైతుల బ్యాంకు అప్పులు మాఫి చేయాలని డిమాండ్ చేశారు. కరువు రైతులను, కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిఆర్ఓకు వినతిపత్రం అందజేశారు.

1. నష్టపోయిన ప్రతి పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా పంట నష్టపరిహారం ఇవ్వాలి.

2. పంటనష్టపరిహారం గరిష్టంగా రెండు హెక్టార్ల వరకు ఇవ్వాలి.

3. పంటసాగుచేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు గరిష్టంగా రూ.50వేలు, వర్షాభావం వల్ల విత్తనం కూడా వేయలేని రైతులకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలి

4. వాస్తవ సాగుదార్లులైన కౌలు రైతులకు పంటనష్టపరిహారం చెల్లించాలి.

5. వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని, రోజుకు రూ.600 ల వేతనం ఇవ్వాలి.

6. పట్టణాల్లో ఉపాధి హామీ పనులు పెట్టాలి

7. రైతుల బ్యాంకు అప్పులు మాఫీ చేయాలి.

8. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక కుటుంబాల విద్యార్థుల అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలి

9. రెవిన్యూ గ్రామాలలో పశుగ్రాసకేంద్రాలు ఏర్పాటు చేయాలి.

10. ఆత్మహత్య చేసుకున్న రైతు, కౌలు రైతులకు పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలి. పై డిమాండ్లను పరిష్కరించి జిల్లా ప్రజలను ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప, బాల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అర్.వి.నాయుడు, మన్నీల రామాంజి, తరిమెల నాగరాజు, కృష్ణమూర్తి, వెంకటనారాయణ, ముస్కిన్, భాస్కర్, మండల నాయకులు పోతులయ్య, కుళ్ళాయప్ప, శివశంకర్, చెన్నారెడ్డి నగర నాయకులు ప్రకాష్, సురేష్, ఇర్ఫాన్, లక్ష్మినారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.