ప్రజాశక్తి – అమరావతి బ్యూరోకాంట్రాక్టు ఉద్యోగులు, స్కీమ్ వర్కర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని, ఇప్పటికే అప్పులు చేసి వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలో నెల వేతనంపైనే ఆధారపడి లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్స్ జీవిస్తున్నారని, అనేక శాఖల వారికి ఐదు నుండి పదినెలలుగా జీతాలు అందక దుర్భర జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇంటి అద్దెలు, పెరిగిన కరెంటు ఛార్జీలు, గ్యాస్, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక, అప్పులు పాలై నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌కు మూడు నెలలుగా, దిశ (సఖి) ఉద్యోగులకు 13 నెలలు, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు రెండు నెలలు, గ్రీన్ అంబాసిడర్లకు ఎనిమిది నెలలు, పంచాయతీ వర్కర్స్‌కు 6 నుండి 11 నెలల వేతనాలు చెల్లించలేదని తెలిపారు. అలాగే వైద్యారోగ్యశాఖ క్లాస్-4 కాంట్రాక్టు ఉద్యోగులకు 14 నెలలు, ఆశా వర్కర్లకు మూడు నెలలు, ఎన్‌హెచ్‌ంసిహెచ్‌ఒ ఉద్యోగులకు నాలుగు నెలలు, మధ్యాహ్న భోజనం కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. టిఎ, డిఎ వంటి బిల్లులూ చెల్లించలేకపోతున్నారని పేర్కొన్నారు. రెగ్యులర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 10వ తేదీకి గానీ వేతనాలు రావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ స్కీం ఉద్యోగులకు, ఇతర కాంట్రాక్టు ఉద్యోగులకు వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సజావుగా లేకుంటే కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్‌టి, రెవెన్యూ బకాయిలు, ఇతర ఆదాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, ఇతర మంత్రులను కలిసి వస్తున్నారే తప్ప ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి గళం విప్పడం లేదని విమర్శించారు. బడా కార్పొరేట్ సంస్థల నుండి రావాల్సిన పన్నుల బకాయిలను రాబట్టడం లేదని, వారికి అనేక రాయితీలిచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని మార్పు వంటి అదనపు ఖర్చులతో ఖజానాపై భారం పెరుగుతోందని తెలిపారు. అప్రాధాన్యత కలిగిన వాటికి, అనవసరపు ఖర్చులను తగ్గించుకుని తక్షణం బకాయిలతో సహా ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని శ్రీనివాసరావు కోరారు.