కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ రహస్య ఒప్పందం   

Nov 28,2023 11:03 #Liquor scam case, #PM Modi, #Telangana

 మద్యం కుంభకోణం కేసు విచారణలో ఉంది

ఎన్నికల  ప్రచార సభల్లో ప్రధాని మోడీ

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో  :  ‘తెలంగాణలో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు రహస్య ఒప్పందంతో ఉన్నాయి. అందులో ఏ పార్టీకి ఓటు వేసినా ఒకే గూటికి వేసినట్టు అవుతుంది. ఒక రోగాన్ని వదిలించుకునేందుకు మరో రోగాన్ని తెచ్చుకోవద్దు. తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే. కెసిఆర్‌ మూఢనమ్మకాలతో సచివాల యాన్ని కూల్చారు’ అని ప్రధాని మోడీ అన్నారు. కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో ఆయన ప్రసంగించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఫాంహౌస్‌ సిఎం కెసిఆర్‌కు ట్రైలర్‌ చూపించామన్నారు. ఈ ఎన్నికల్లో కెసిఆర్‌ ఖేల్‌ ఖతమవుతుందని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌ పాలనలో కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగులు పెరిగారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వంలో తొలి సిఎం బిసి సామాజిక తరగతి నుంచే ఉంటారన్నారు. ఇక్కడి ప్రజల్లో పరివర్తన కనిపిస్తోందని, మార్పునూ నిశ్చయించుకున్నారని పేర్కొన్నారు. పలుమార్లు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రధాని మధ్యలో కరీంనగర్‌ ఫిలిగ్రీ కళను ప్రస్తావించారు. మన్‌కీ బాత్‌లోనూ తాను దీని గురించి మాట్లాడానని, కళాకారుల కోసం పిఎం విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టానని అన్నారు. దీనిద్వారా ఇక్కడి ఫిలిగ్రీ కళాకారులకు ఆధునిక శిక్షణ, రూ.లక్షల్లో రుణం లభిస్తుందని తెలిపారు.

తెలంగాణలోని అన్ని స్కాములపై విచారణ

తెలంగాణలో జరిగిన అన్ని స్కాములపై విచారణ చేపట్టే సత్తా బిజెపికే ఉందని మహబూబాబాద్‌ సభలో నరేంద్ర మోడీ అన్నారు. బిఆర్‌ఎస్‌ అవినీతిపరులందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణను బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ భ్రష్టుపట్టించాయని విమర్శించారు. ఓడిపోతానని తెలుసుకున్న కెసిఆర్‌ ఢిల్లీకి వచ్చి తనతో దోస్తీకి ప్రాధేయపడ్డారన్నారు. తాను తిరస్కరించడం వల్లే విమర్శలు చేస్తున్నారని వివరించారు. ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయాన్ని మూఢనమ్మకాల కోసం కెసిఆర్‌ కూల్చివేశారని విమర్శించారు.

➡️