హైదరాబాద్ : ఉదయం 11 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 20.64% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను పోలింగ్ బూత్‌ల నుంచి దూరంగా పంపించేశారు. అక్కడక్కడా లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
- నాగర్‌కర్నూల్ లోని అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
- ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
- నిర్మల్ జిల్లా భైంసాలో కాషాయ కండువాలతో ఓటు వేసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు.
- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్‌లో పోలింగ్ బూత్ వద్ద బీఆర్‌ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
- జనగామ పట్టణంలోని 244 బూత్ వద్దకు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు చేరుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని షట్పల్లి పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు గుమిగూడారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
- విజయమేరి పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. వికారాబాద్ జిల్లా చౌడపూర్ లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
- అచ్చంపేట నియోజకవర్గంలోనూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పదర మండలం వంకేశ్వరంలో ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.