ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరలా పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాల్లో అడుగుపెట్టనున్నారు. స్కిల్ డెవలప్‌మంట్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్టయిన ఆయన సుమారు 3 నెలల తరువాత ప్రజానీకంలోకి రానున్నారు. ఈ కేసులో 53 రోజులపాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ నెల 1న వైద్యం కోసం బైయిల్‌పై వచ్చి హైదరాబాద్‌లో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. హైకోర్టు ఈ నెల 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 30న తిరుపతి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి డిసెంబర్ 1న తిరుమల దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి విజయవాడ దుర్గగుడి, విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం, శ్రీశైలం దేవస్థానాలకు వెళ్లనున్నారు. ఆలయాల దర్శనాల అనంతరం డిసెంబర్ మొదటి వారంలో రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని అంటున్నారు. మరోపక్క చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా నిజం గెలవాలి కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశాలు ఉంటాయని నాయకులు చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లిన బాబుసుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్లారు. టిడిపి ఎంపిలు కనకమేడల రవీంద్ర, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆయనకు స్వాగతం పలికారు. మంగళవారం అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.