హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్త్రుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్.. తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే మొత్తం 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా ఏర్పాట్లు శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలైన ఓట్లను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 13 నియోజకవర్గాలకు విడివిడిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేయడంలో నిమగమైనట్లు తెలిపారు.