పూణె: చెన్నై నుండి పూణే వెళ్లే భారత్ గౌరవ్ రైలులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు తక్షణ స్పందించి పూణె స్టేషన్‌లో డాక్టర్లను, వైద్య సిబ్బందిని రప్పించి చికిత్స అందించారు. వివరాల్లోకి వెళితే, చెన్నై నుంచి పూణె వెళ్తున్న రైలులో సుమారు 1,000 మంది ప్రయాణిస్తున్నారు. పూణె చేరడానికి ముందు రైలులో ఆహారం తిన్న సుమారు 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా మైకం, వాంతులు, కడుపులో నొప్పి, విరోచనాలు వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ సంస్థ ఈ భారత్ గౌరవ్ రైలును నిర్వహిస్తోంది. సంఘటనకు సంబంధించి కలుషిత ఆహారంపై దర్యాప్తు చేపట్టి కంపెనీపై మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.