ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు – యువగళం బహిరంగ సభలో లోకేశ్‌

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాబోతుందని, వచ్చిన ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. యువగళంలో భాగంగా ఆయన శుక్రవారం కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభమైన యాత్రకు టిడిపి, జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్పవరం జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.మూడు వేలు, ప్రతి ఏడాదీ జాబ్‌ నోటిఫికేషన్‌, పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓటమి భయంతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేశారన్నారు. వైసిపి నాయకుల ఆరోపణలను ఎవరూ నమ్మలేదన్నారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారన్నారు. యువగళం ఆగదని, తాడేపల్లి ప్యాలెస్‌ గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు. ఇసుక దోపిడీలో జగన్‌ వాటా ఏడాదికి రూ.1080 కోట్లు పైమాటేనని ఆరోపించారు. సాగునీరు లేక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే, కనీసం సిఎం సమీక్ష కూడా చేయడం లేదని విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీలు తొమ్మిది సార్లు, ఆర్టీసీ బస్‌ ఛార్జీలు మూడు సార్లు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసర సరుకుల ఇలా అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే మహిళలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బిసిల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. జగన్‌ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జనసేన నాయకులు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️