ప్రజాశక్తి-అమరావతి బ్యూరోఆగేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమం, వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడిందని, దీని ప్రభావంతో రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని రాష్ట్ర విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టరు బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం గురువారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాల వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి నైరుతిని ఆనుకుని వున్న ఆగేయ బంగాళాఖాతంలో క్రమంగా తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని, అలాగే ఆదివారం వరకు వేటకు వెళ్లరాదని సూచించారు.