ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 1021వ రోజుకు చేరాయి. దీక్షలో స్టీల్‌ప్లాంట్ కోక్ ఓవెన్ విభాగ కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ నాయకులు మోహిద్దీన్, జె.రామకృష్ణ మాట్లాడుతూ.. పోరాట కమిటీ నిర్ణయాలను తప్పకుండా అమలు చేయాలని కార్మికులను కోరారు. స్టీల్‌ప్లాంట్ అమ్మకం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకూ ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీక్షా శిబిరంలో కోకో ఒవెన్ విభాగ అఖిలపక్ష కార్మిక నాయకులు దేవుడునాయుడు, సోమేష్, నర్సింగరావు, కార్మికులు పాల్గొన్నారు.