మంగళగిరి: మద్యపాన నిషేధం చేస్తానన్న సీఎం జగన్.. ఊరూ వాడా నాసిరకం లిక్కర్ తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్మిన మాదిరి వైసిపి నేతలు నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అచ్చెన్న మాట్లాడారు. ఫుడ్ డోర్ డెలివరీ చేసినట్లు మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తయారీ నుంచి అమ్మకం వరకూ మొత్తం సీఎం జగనే చేయిస్తున్నారని అచ్చెన్న విమర్శించారు. కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 34 వేల మంది చనిపోయారన్నారు.మద్యం ద్వారా ప్రభుత్వ అధికారిక ఆదాయం రూ.1.14 లక్షల కోట్లయితే.. అనధికారికంగా సీఎం జగన్‌కు రూ.లక్ష కోట్ల సొంత ఆదాయం వచ్చిందని అచ్చెన్న ఆక్షేపించారు. ధరలు పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారన్నది ఓ పిచ్చి వాదన అని మండిపడ్డారు. వైసిపి పాలనలో ఏటా మద్యం ధరలు పెరిగాయే కానీ ఎక్కడా తగ్గలేదన్నారు. మేనిఫెస్టోలో కనీసం 30 శాతం హామీలు కూడా నెరవేర్చకుండా 99 శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.