– ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణతోనే సామాజిక న్యాయం
– నంద్యాలలో ఎపి మహిళా సమాఖ్య15వ రాష్ట్ర మహాసభ ప్రారంభం
ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్ :రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంటులో మహిళా బిల్లు తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు జాతీయ నాయకులు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న చట్టాలను కేంద్రీకృతం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రయివేటుపరం చేస్తున్నారని, దీంతో సామాజికన్యాయం, మహిళా సాధికారత ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య 15వ రాష్ట్ర మహాసభ రెండు రోజుల పాటు నంద్యాలలో జరగనుంది. తొలిరోజు శుక్రవారం నంద్యాల పెద్ద మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ టౌన్ హాల్ వరకు భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వనజ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు చూస్తోందన్నారు. మహిళలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మహిళా సాధికారతను తుంగలో తొక్కారని, మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ఒక నాటకమని విమర్శించారు. మహిళల పట్ల ప్రధాని మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చట్టసభలలో మహిళా రిజర్వేషన్లను రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటు రంగ సంస్థకు అప్పగిస్తూ ఉపాధిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ముప్పాల నాగేశ్వరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు విలతాండవమాడుతున్నా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కరువును తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి గుంటూరు పల్నాడు వంటి ప్రాంతాలకు ప్రజలు వలసలు పోతున్నారని, వారిని ఆదుకోవడంలో సిఎం పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి అధ్యక్షత వహించారు . రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గ భవాని, వర్కింగ్ అధ్యక్షులు అత్తిలి విమల, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు.