భూగర్భ గనిలో ప్రమాదం- ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Nov 27,2023 09:08 #under ground drinage

ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా)అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కొండుపల్లి గ్రామ సమీపంలోని భూగర్బ గనిలో ఉన్న డోలమైట్‌ను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన జిలిటిన్‌స్టిక్స్‌ పేలి ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనాపురం, రావులుడికి గ్రామాలకు చెందిన కొందరు కూలీలు ఆదివారం కొండుపల్లి వద్ద ఉన్న రాజపుల్లయ్య మినరల్స్‌ భూగర్భ డోలమైట్‌ గనిలో పని చేసేందుకు వెళ్లారు. రాయి పెకలింపు కోసం రోజువారి పేలుడు సామగ్రి(ఘాతాలు) సుమారు 15 చోట్ల పెట్టి పేల్చారు. వీటిలో రెండు పేలలేదు. పేలని వాటిని గుర్తించేందుకు కంబగిరిస్వామి(38), రాజ్‌కుమార్‌ మరో ముగ్గురు కార్మికులు ఆ ప్రాంతం వద్దకు వెళ్లారు. వీరు పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కంబగిరిస్వామి అక్కడికక్కడే మృతి చెందగా, రాజ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తోటి కార్మికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాడిపత్రి డిఎస్‌పి సిఎం.గంగయ్య, సిఐ శంకరరెడ్డి, యాడికి ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.

➡️