– కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కోరిన సిపిఎం నాయకులు
ప్రజాశక్తి – గోరంట్ల రూరల్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నాసన్, బెల్ కంపెనీకి భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ను సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ కోరారు. నాసన్ అభివృద్ధి పనులను పరిశీలించడానికి కేంద్ర మంత్రి వస్తున్న నేపథ్యంలో భూములు కోల్పోయిన వందలాది మంది రైతులు గురువారం ఉదయం నాసన్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది గంటల పాటు నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ.. మండల పరిధిలోని పాలసముద్రం, చిన్న బాబయ్యపల్లి గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు దళిత, రైతులు 1150 ఎకరాల భూమిని నాసన్, బెల్ కంపెనీల భూ సేకరణలో భూములు కోల్పోయారన్నారు. పరిహారం అందించడంలో ప్రభుత్వం వివక్ష చూపిందని, అగ్రవర్ణాల రైతులకు ఒకరకంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు మరో రకంగా పరిహారం అందజేసిందని విమర్శించారు. అన్ని వర్గాలకు సమానంగా భూ పరిహారం అందాలని డిమాండ్ చేశారు. ఆందోళన ప్రాంతానికి పోలీసులు చేరుకుని నాయకులతో మాట్లాడారు. కేంద్ర మంత్రికి సమస్యను వివరించేందుకు నలుగురు ముందుకు రావాలని పోలీసులు కోరారు. దీంతో సిపిఎం నాయకులు ఇంతియాజ్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పెద్దన్న, ప్రవీణ్, బాధితురాలు గంగమ్మ ముందుకు వచ్చారు. కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. పరిహారం అందించడంలో రైతుల పట్ల వివక్ష చూపరాదని, అలసత్వం వహించరాదని కోరారు. అందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. సత్యసాయి జిల్లా కలెక్టర్‌ను పిలిచి పది రోజుల్లోపు రైతుల పరిహార విషయం తేల్చాలని ఆదేశించారు. ఈ విషయంపై తాను ఫోను ద్వారా సంప్రదిస్తానని చెప్పారు. దీంతో నాయకులు, నిర్వాసితులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, సిఐటియు మండల అధ్యక్షులు వెంకటేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ, గంగాధర, భూ నిర్వాసితులు గంగమ్మ, రమీజా, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.