తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: సీపీఐ నారాయణ

Dec 1,2023 14:35 #cpi narayana, #press meet

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ జాతీయ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ ఆహ్వానించే పరిస్థితి రానుందన్నారు. ప్రశ్నిస్తున్నాడని ఒక్కపుడు కేసీఆర్‌ రేవంత్‌ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయించారని.. అదే రేవంత్‌ రెడ్డికి స్వాగతం పలకడానికి కేసీఆర్‌ రెడీగా ఉండాలన్నారు. తెలంగాణలో హంగ్‌ ప్రభుత్వం రాదని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ గెలుపుపై కేటీఆర్‌, కవితవి దింపుడు కల్లం ఆశలని ఆయన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్‌ ఐదేండ్లు సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతోందని నారాయణ తెలిపారు. కేసీఆర్‌ లాంటి నియంత కంటే.. కాంగ్రెస్‌లో ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా పర్లేదని నారాయణ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ క్యాంపుకు పోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలవబోతోందని అహంభావం ఓడిపోతుందని వెల్లడించారు. ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా మంచిదే కానీ.. ఈ ఒక్క ముఖ్యమంత్రి ఉంటేనే ప్రమాదకరమన్నారు. కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధిస్తుందని నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

➡️