హైదరాబాద్: తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ దాదాపు 3 శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం 70.79శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.”పోలైన ఓట్ల వివరాల పరిశీలన కొనసాగుతోంది. మరో రెండు గంటల్లో అది పూర్తవుతుంది. అప్పుడు పోలింగ్ శాతంపై పూర్తి స్పష్టత వస్తుంది. 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ ఫ్రం హోమ్ మంచి ఫలితాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదు. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56శాతం పోలింగ్ నమోదైంది” అని వికాస్‌రాజ్ చెప్పారు.