ప్రజాశక్తి- జి.సిగడాం/లావేరు (శ్రీకాకుళం జిల్లా):ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కౌలు రైతు సంఘం నాయకులు భవిరి కృష్ణమూర్తి, ఎం.వి.రమణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మధుపాం, చెట్టిపొదులాం, పెనసాం, సేతుభీమవరం, చంద్రయ్యపేట, డి.ఆర్.వలస, లావేరు మండలం వెంకటాపురం గ్రామాల్లో పాడైన వరి పంటలను కౌలు రైతు సంఘం నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో కురిసిన వర్షాలకు ఆకుమడులు సిద్ధం చేశామని, తర్వాత వర్షాలు లేకపోవడం, సాగునీరు విడుదల చేయకపోవడంతో పంటను బతికించేందుకు నానా తంటాలు పడ్డామని తెలిపారు. రెండేళ్లుగా సాగునీరు సక్రమంగా రావడం లేదని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కృష్ణమూర్తి, రమణ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయాధికారులు గ్రామాన్నిగానీ, పంచాయతీనిగానీ యూనిట్‌గా తీసుకుని పంట నష్టాలను పరిశీలించి కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎకరా పంటకు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించాలని, రబీకి కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందజేయాలని కోరారు. పంట రుణాలను రద్దు చేసి కొత్త రుణాలను వడ్డీ లేకుండా ఇవ్వాలని, నీటి తీరువానూ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్, రబీ పంటలకు తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టు నుంచి నిరంతరం సాగునీరు అందించాలని కోరారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.