ఏడుగురికి తీవ్రగాయాలు
ప్రజాశక్తి – సీలేరు, ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా)ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో సిమెంట్ లోడుతో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడడంతో అరుగురు మృతి చెందారు. ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. మల్కనగిరి జిల్లా కటాఫ్ ఏరియాలోని జోడాంబోలో ఓ నిర్మాణ సంస్థ ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తోంది. అందుకు అవసరమైన వంద బస్తాల సిమెంటు, ఇనుప ఊచలను జనతాపారులో లోడ్ చేసుకుని డ్రైవర్‌తో సహా 13 మంది జోడాంబోకు టిప్పర్‌లో వెళ్తున్నారు. వంతలగూడ దాటిన తరువాత జోడాంబో ఘాట్ రోడ్డులో టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే మరణించారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, బిఎస్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చిత్రకొండ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా నవరంగపూర్, కొసమగుడ బ్లాక్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో సుందర్ బాత్రా, జిట్టా బాత్రా, జీపర్లన్ బాత్రా, పుర్వంగ్ బాత్రా దుర్కోదర బాత్రా, సుందర్ బాత్రా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా సిఎం తీవ్ర దిగ్భ్రాంతిప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.