‘ఉక్కు’ పరిరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 19,2023 21:30 #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)
ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ధ్యేయంగా ఉండాలని సిఐటియు సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1011వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సభ్యులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం యువత నడుం బిగించాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, ప్లాంట్‌ను పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపేంత వరకూ పోరాటాలు కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపారు. ప్లాంట్‌ ప్రయివేటుపరమైతే ఉద్యోగ భద్రత కరువవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బండా తౌడన్న, సభ్యులు సవరపు సత్యనారాయణ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️