ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, నాయకులు వరసాల శ్రీనివాసరావు కోరారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1017వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ డబ్ల్యుఎండి, అడ్మిన్, యుటిలిటీస్, టౌన్ అడ్మిన్, టిటిఐ విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెడితే పన్నుల రూపంలో ప్లాంట్ రూ.25 వేల కోట్లు రాష్ట్రానికి, రూ.50 వేల కోట్లు కేంద్రానికి చెల్లించిందన్నారు. ప్రస్తుతం మూడు లక్షల కోట్లకుపైగా ఆస్తులను కలిగి ఉందని తెలిపారు. నేటి పాలకులు విశాఖ ఉక్కు లాంటి భారీ పరిశ్రమను నిర్మించగలరా ? అని ప్రశ్నించారు. పోరాటాలు, త్యాగాలతో ఏర్పడ్డ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ కదన రంగంలోకి దిగాలన్నారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు ఎన్.రామచంద్రరావు, కామేశ్వరరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.