ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయడానికి జరుగుతున్న కుట్రలను ఐక్యపోరాటాలతో తిప్పికొడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1020వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ సింటర్ ప్లాంట్ కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు జె.రామకృష్ణ మాట్లాడుతూ.. విభాగాల వారీగా ప్రయివేటీకరణకు టెండర్లు పిలవడం, ప్రధాన విభాగాల్లో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించడం ద్వారా ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టడం, కార్మికులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చకపోవడం వంటి చర్యలతో ఉక్కు యాజమాన్యం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. సకాలంలో రా మెటీరియల్‌ను కొనుగోలు చేయడం లేదన్నారు. ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా వెయ్యి రోజులుకు పైగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నా మోడీ సర్కారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీక్షల్లో నాయకులు కె.భాస్కర్‌రావు, కెవి.సత్యనారాయణ, డివికె.రాజు పాల్గొన్నారు.