ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి:అర్హులందరూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ప్రణాం పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ బుర్రకథను కళాజాతా బృందం ప్రదర్శించింది. బాలాజీ విద్యాలయం, లిటిల్ ఫ్లవర్ విద్యా సంస్థల చిన్నారులు స్వాగత గీతానికి, పర్యావరణహిత సేద్యం చేయడం ద్వారా భూమాతను పరిరక్షించుకోవాలనే సందేశాన్ని ఇస్తూ సాగిన గేయాలకు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్ నాగిరెడ్డి, కలెక్టర్ పి.రాజాబాబు, తదితరులు పాల్గొన్నారు.