నిర్మాణ కార్మికుల భద్రతే ముఖ్యం

Dec 1,2023 10:07 #Uttarakhand, #Uttarkashi tunnel
uttarakhand-tunnel-operation-what-happens-after-rescue

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదంపై విచారణ జరపాలి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రధాని, సిఎంలకు సిడబ్ల్యూఎఫ్‌ఐ లేఖ
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో టన్నెల్‌ కూలిపోయిన ప్రమాదం నుంచి 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడటంపై సిఐటియు, కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిడబ్ల్యూఎఫ్‌ఐ) హర్షం వ్యక్తం చేశాయి. ప్రమాద ఘటనలో భద్రతా ఉల్లంఘనలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి ధామికి సిడబ్ల్యూఎఫ్‌ఐ లేఖ రాసింది. ఈ ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని, ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. అవసరమైన భద్రతా చర్యలు తీసుకోకుండా ఎలాంటి నిర్మాణ పనులను అనుమతించవద్దని పేర్కొంది. తమ డిమాండ్లపై డిసెంబర్‌, జనవరిల్లో దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని సిడబ్ల్యూఎఫ్‌ఐ నిర్ణయించింది. ఈ ప్రచారంలో భాగంగా సిడబ్ల్యూఎఫ్‌ఐ అన్ని అనుబంధ సంఘాలు కూడా శుక్రవారం ప్రధాని, ముఖ్యమంత్రికి లేఖలు పంపనున్నాయి. కార్మికులను రక్షించడంలో ర్యాట్‌ మైనర్ల చిత్తశుద్దిని సిఐటియు, సిడబ్ల్యూఎఫ్‌ఐ అభినందించాయి. టన్నెల్‌ ప్రమాద ఘటన కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, అధికారులు సరైన రక్షిత చర్యలు తీసుకోవడంలో వైఫల్యంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని పేర్కొన్నాయి. అధికారుల, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రమాదాల జాబితాలో ఈ టన్నెల్‌ కూలిపోయిన ప్రమాదం ఒకటని తెలిపాయి. ప్రభుత్వ మౌలిక సదుపాయాల నిర్వహణను ప్రైవేట్‌ కార్పొరేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలను ఈ ప్రమాదం మరోసారి బహిర్గతం చేసిందని పేర్కొన్నాయి. నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టుల్లో ఇటీవల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఆ సంస్థపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించాయి. దీనిని బట్టి అదానీ గ్రూప్‌ మాదిరిగానే నవయుగ కూడా మోడీ ప్రభుత్వానికి అభిమాన సంస్థగా మారిందని అర్థమవుతోందని తెలిపింది.ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

➡️